
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ నటుడు కొణిదెల చిరంజీవి వ్యక్తిత్వ హక్కులపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిత్వ, ప్రచార హక్కుల ఉ ల్లంఘనలు, పరువు నష్టం చర్యలు జరిగితే, సం బంధిత పౌర, ఫౌజ్‌దారీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ సివిల్ కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పిటిషన్‌లో పేర్కొ న్న పలువురితోపాటు ఎవరైనా వ్యక్తి, సంస్థ అయి నా చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్ తదితర గుర్తించిన వాటిని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని సిటీ సివిల్ న్యాయస్థానం నిషేధించింది. ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్న సమయంలో ఎవరైనా వ్యక్తి, సంస్థ ద్వారా జరిగే ట్రోలింగ్, మార్ఫింగ్, అభ్యంతరకర కంటెంట్ ప్రచారం, అనుమతి లేని వాణిజ్య వినియోగంపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు హెచ్చరించింది.
తన పేరు, చిత్రం, ప్రసిద్ధ సినీ శీర్షికలను అనుమతి లేకుండా వాడుకోవడం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్ మొదలైన వేదికలపై వినియోగించడం, అలాగే కృత్రిమ మేథస్సు (ఏఐ) ద్వారా రూపాంతరం చేసిన (మార్ఫ్ చేసిన) చిత్రాలు, వీడియోలను ప్రచారం చేయడాన్ని ఆపివేయాలని చిరంజీవి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చలనచిత్ర రంగంలో అగ్ర హీరోగా ఉన్నత స్థాయిలో ఉన్న చిరంజీవి స్థానాన్ని గుర్తిస్తూ ఆయన పేరుపెట్టి, చిత్రాలు తీసుకొని, వీడియో-మీమ్స్ చేసి, అనుమతి లేకుండా వినియోగం, తదితర చర్యల ద్వారా ప్రతివాదులు చేసిన ఉల్లంఘనలు ఆయన ఖ్యాతి, గౌరవానికి నష్టం కలిగిస్తున్నాయని చిరంజీవి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రధానంగా డిజిటల్, ఏఐ వేదికల ద్వారా జరిగే వాణిజ్య దోపిడి, తప్పుడు ప్రతిరూపణలతో అపరిమిత నష్టం సంభవించే ప్రమాదాన్ని కోర్టు గమనించింది. ఈ నిషేధాజ్ఞ ప్రకారం చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్ అయిన మెగాస్టార్, చిరు, అన్నయ్య ఆయన స్వరం, చిత్రంతో పాటు ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఇతర వ్యక్తిత్వ లక్షణాలను ఏ రూపంలోనైనా, ఏ మాధ్యమంలోనైనా, వ్యక్తిగత, వాణిజ్య లాభం కోసం నేరుగా గానీ పరోక్షంగా గానీ ఉపయోగించవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు అందరూ ప్రతివాదులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.




