
కళ కళ కోసం కాదు ప్రజల కోసమే అన్నట్లుగా ఆట-పాటలనే ఆయుధంగా చేసుకొని నిరంతరం ప్రజా ఉద్యమ పంథాలో కొనసాగిన కళాత్మక సమరశీలి కామ్రేడ్ సత్యన్న. భూక్య సత్యనారాయణ అలియాస్ సత్యన్న అలియాస్ పెద్దన్నగా పేరు గడించిన సత్యన్న పేరుకు తగ్గట్టుగానే జీవితాంతం ఎత్తిన ఎర్రజెండాను దించలేదు. నమ్మిన సత్యాన్ని, సిద్ధాంతాన్ని వీడలేదు. పెద్దన్నగా పెద్దరికంతో కూడిన హుందాతనం ఆయన సొంతం. అందరి కోసం నేను అన్నట్లుగా జీవించేవారు. మే 18,1963 సంవత్సరంలో ఖమ్మం జిల్లా, తిరుమలయపాలెం మండలం, కాకరవాయి గ్రామంలో భూక్యా రాములు-తిరుపతమ్మ దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించిన భూక్యా సత్యనారాయణకు ముగ్గురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెలు ఉన్నారు. భూక్యా సత్యన్న జీవనోపాధిరీత్యా యుక్త వయసులోనే మహబూబాబాద్ కు వలస వచ్చారు. ఆ సమయంలో మహబూబాబాద్ లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకత్వంలో ఎగురుతున్న ఎర్రజెండా రెపరెపలకు ముగ్దుడై ఎర్ర జెండా ఎత్తి పట్టి పోరాట బాట పట్టారు.
మానుకోట ప్రాంతంలో కామ్రేడ్ ధర్మన్న సహచరునిగా ప్రజా ఉద్యమంలో కొనసాగారు. ప్రజా పోరాట తత్వాన్ని అలవర్చుకున్న భూక్యా సత్యన్న తన స్వగ్రామమైన కాకరవాయి గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ గ్రామ శాఖ నిర్మించి ఎర్రజెండా ఎగురవేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై తెలంగాణ ఉద్యమ ప్రజా కళాకారులతో జతకట్టి ఉద్యమ పాటల పల్లకి ఎత్తుకున్నారు. ఆ క్రమంలోనే తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జేఏసీ, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ జానపద కళాకారుల సంఘం, విశ్వ సమాజం తదితర ప్రజా సంఘాలలో చేరి, ప్రజా ఉద్యమకారునిగా, ప్రజా కళాకారునిగా పనిచేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఖమ్మం జిల్లా సాంస్కృతిక విభాగం కో కన్వీనర్‌గా ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో విస్తృతమైన కళా ప్రదర్శనలు ఇచ్చారు.
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వ సమాజం వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది రచయిత విశ్వ జంపాల సహచరత్వంలో తెలంగాణ, సామాజిక న్యాయ ప్రజా పోరాటాల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ ప్రజా కళాకారుడుగా కాలుకు గజ్జ కట్టి గోసి గొంగడేసి కైగట్టి పాట పాడుతూ తెలంగాణ ప్రజా యుద్ధనౌక గద్దరన్నను అనుకరిస్తూ ఆడుతూ పాడుతూ ప్రజలను ఆకట్టుకునేవారు. ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో ప్రజా యుద్ధనౌక గద్దరన్న, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పాల్గొన్న ప్రతి కళా ప్రదర్శనలో, సమావేశాల్లో విధిగా పాల్గొనేవారు. వృత్తిరీత్యా బిల్డింగ్ నిర్మాణ పనులు, రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవారు. మహబూబాబాద్ పట్టణంలో పేదల ఇళ్ల స్థలాల కోసం జరుగుతున్న అనేక పోరాటలలో సైతం పాల్గొని ప్రజా పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచారు.
ప్రజా ఉద్యమ వేదికల మీద రొమ్ము విరిచి, గుండెలు బాదుకుంటూ పేదల ఆకలి కేకల బాధలను పోరాట పాటలుగా వినిపించేవారు. సత్యనారాయణకు భార్య సీతాదేవి పెద్ద కూతురు విశాల, చిన్న కూతురు విమల, కుమారుడు విక్రమ్ ఉన్నారు. మంచికి మారుపేరు, సహానశీలి, మానవత్వం, పెద్దరికం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిగా చిరునవ్వుల పలకరింపులతో అందరి హృదయాలలో సుస్థిర స్థానం పొంది, అందరికీ ఆదర్శంగా నిలచిన కామ్రేడ్ భూక్య సత్యన్న గుండె పోటుతో తెలంగాణ బీసీ బంద్ రోజున ది.18.10.2025న అకాల మరణం చెందారు. ఎందరో కవులు కళాకారులు ఉద్యమకారుల సాన్నిహిత్యం పొంది, వారి సహచరునిగా తన పాద ముద్రలను వదిలి వెళ్లారు. ప్రజా కళాకారునిగా, ప్రజా ఉద్యమకారునిగా కామ్రేడ్ భూక్యా సత్యనారాయణ అలియాస్ సత్యన్న అలియాస్ పెద్దన్న ఆలోచన విధానాన్ని ఆయన మహోన్నత ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకు అర్పించే ఘనమైన నివాళి.
(27.10.2025న మహబూబాబాద్‌లో జరగనున్న కామ్రేడ్ భూక్య సత్యన్న సంస్మరణ సందర్భంగా)
విశ్వ జంపాల అడ్వకేట్ (విశ్వ సమాజం వ్యవస్థాపకులు)
77939 68907




