
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తయినప్పటికీ సామాజిక న్యాయం అందని ద్రాక్షగానే మిగిలింది. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఇతర వెనకబడిన కులాలకు సమాన అవకాశాల కల్పనలో పార్టీలకు చిత్తశుద్ధి లేదు. ఇప్పటికీ జనాభా ప్రకారం వారికి విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేదు. అగ్రకులాలు అదనపు హక్కుల పొందగా ఓబీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పావులుగా మారుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ బిల్లుపై పార్టీల స్పందనే ఇందుకు నిదర్శం. స్థానిక సంస్థల్లో 42 బీసీ రిజర్వేషన్ల అమలుకై తెచ్చిన జీవో 9కు కోర్టులో అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో రాష్ట్రంలో అక్టోబర్ 18న బీసీ రిజర్వేషన్ సాధనకు బీసీ సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్యర్యంలో బంద్ ప్రకటించారు.
దీనికి మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్దతు పలికాయి. పొలిటికల్ మైలేజ్ కోసం పరస్పర రాజకీయ ఆరోపణలకే పరిమితమయ్యాయి. అసలు 42శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టపరమైన పరిష్కారం చూపాలనే నిబద్ధత ఏ పార్టీకి లేదని అర్థమవుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ అనేది ఆయా వర్గాల ప్రాతినిధ్యం. కానీ సుప్రీం కోర్టు ఇందిరా సాహ్ని కేసులో 50శాతం పరిమితిని విధించింది. ప్రజలచే ఎన్నుకోబడిన పాలకులు తలుచుకుంటే ఈ పరిమితిని తొలగించలేరా?. అసలు అడ్డుకునేది ఎవరు? న్యాయ స్థానాలా? న్యాయ బద్దతలేని విధానాలా?.. ఆలోచన చెయ్యాలి. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి.
డా. బి.ఆర్. అంబేద్కర్ కేవలం దళితుల కోసమే కాదు, ఇతర వెనుకబడిన తరగతుల అభ్యున్నతిలోనూ ప్రధాన పాత్ర పోషించారు. మహాత్మా ఫూలే, సాహూ మహారాజ్ వంటి వెనకబడిన వర్గ ఉద్యమ నేతల ఆలోచనలను అంబేద్కర్ స్వీకరించి, వాటిని భారత రాజ్యాంగంలో ప్రతిబింబింపజేశారు. ఓబీసీలు తమతో కలిసి రానప్పటికీ అంబేద్కర్ వారికి సమాన న్యాయం, విద్యాఅవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం రావాలని పట్టుదలగా ప్రయత్నించారు. రౌండ్ టేండ్ సమావేశాల్లో ఆయన వెనుకబడిన కులాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయల్లో ప్రత్యేక అవకాశాలు కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించారు. రాజ్యాంగంలో 340వ అధికరణాన్ని చేర్చించారు. దీంతో వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటుకు మార్గం సుగమనమైంది. ఈ అధికరణ ఆధారంగా ఓబీసీల జాబితా రూపొందించి, వారికి రిజర్వేషన్లు కల్పించటానికి ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధ బాధ్యత ఏర్పడింది. ఈ క్రమంలో కాక కలేల్కర్, బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కారణంగానే బీసీల రిజర్వేషన్ల కొంతమేర చట్టబద్ధమైనవి. స్వాతంత్య్రం అనంతరం జవహర్ లాల్ నెహ్రూ తొలి కేబినెట్లో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు.
1951లో ఆయన మహిళలకు వారసత్వం, సమాన హక్కులు కల్పించాలనీ‘హిందూ కోడ్ బిల్లును ప్రతిపాదించారు. దీనికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులు వ్యతిరేకించడంతో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అంబేద్కర్ 1951 అక్టోబర్ 10న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆనాడు ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం కూడా తన రాజీనామాకు కారణంగా పేర్కొన్నారు. ఈ వాస్తవం బీసీ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజీనామా అనంతరం అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కలిపి ఒక శక్తిగా ఎదగడం అవసరమని భావించారు. షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి రాజకీయ వేదికల ద్వారా దళితులు, బీసీలు, మహిళలు సమాన హక్కులు కోసం పోరాడారు. నేడు దేశంలో బీసీల సంక్షేమానికి అంబేద్కర్ దిక్సూచి. కావున ఇప్పుడు బీసీ విముక్తికి చారిత్రకంగా మహనీయుల పోరాటాలు పాఠం కావాలి.
అంబేద్కర్ తర్వాత ఆయన ఉద్యమ రథాన్ని ముందుకు నడిపించిన కాన్షీరాం సైతం ఇతర వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడారు. 1980 సంవత్సరంలో మండల్ కమిషన్ ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. వీటి అమలుకై కాన్షీరాం డిల్లీ బోట్స్ క్లబ్ ముందు 48 రోజుల ధర్నా చేశారు. అప్పుడు వి.పి సింగ్ ప్రభుత్వం ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాల్లో కల్పిస్తూ చట్టం తెచ్చారు. ఈ విధంగా కాన్షిరాం బీసీ రిజర్వేషన్ ఉద్యమం దేశంలో విప్లవం సృష్టించింది. ఆ దిశగా మరో స్వాభిమాన బీసీ ఉద్యమం బయలుదేరాలి. ఈ క్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్, ఉమ్మడి ఏపీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బాలగోని బాలరాజు గౌడ్, పొన్నం దేవరాజ్ గౌడ్, జి.కిరణ్ కుమార్ నేతృత్వంలో బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఏర్పాటయ్యింది. ఈ సమితి బీసీ కేటగిరీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, తమిళనాడు తరహాలో వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నది. ఇది బీసీ రిజర్వేషన్లకు శాస్త్రీయ పరిష్కారం కానుంది. న్యాయపరమైన రక్షణ లభించనుంది. ఈ రిజర్వేషన్లను రాజకీయ, విద్య, ఉద్యోగాల్లోనూ అమలుకై పటిష్టమైన ఉద్యమం చేపడుతున్నారు. ఈ నెల24న ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నా నిర్వహించారు. తదుపరి బీసీ చైతన్య యాత్ర చేపట్టబోతున్నారు. బీసీ సంఘాలతో పాటు ఇతర కుల సంఘాలు ఈ సమితికి తోడై దేశవ్యాప్త ఉద్యమంగా మారాలి. అప్పుడే బీసీలకు సామాజిక న్యాయం, రాజ్యాధికారం దక్కే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో బహుజన వర్గాలంతా తరతరాలుగా అగ్రకుల పాలకుల దోపిడికి గురయ్యారు. ఈ క్రమంలో 90 శాతం బీసీ ఎస్సీ ఎస్టీ బలగాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగించాలి. ఇందుకై వారిని పూలే, అంబేద్కర్, కాన్షీరాం దారిలో నడిపించడానికి డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆలోచన నుంచీ మార్చు 31, 2025న బిసి,ఎస్సీ,ఎస్టీల ఐక్య కార్యాచరణ సమితి(జాక్) ఆవిర్భవించింది. దీని ఆధ్వర్యంలో అదిలాబాద్ కేంద్రంగా ఏప్రిల్ 14 2025 న లక్ష కిలో మీటర్ల రథయాత్ర ప్రారంభమైనది. ఇది అట్టడుగు వర్గాల సమస్త రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతూనే.. రాజ్యాధికారం కోసం ధర్మ యుద్ధం చేస్తున్నది. ప్రజా సమస్యలపై సింహ గర్జన చేస్తున్నది. ఈ యాత్ర అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నది. ఇది ప్రత్యామ్నాయ ప్రతిపక్షమై సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నది.
దీనిలో భాగమైన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు టి.చిరంజీవులు గారు బీసీల చైతన్యానికి కృషి చేస్తున్నారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన జస్టిస్ ఈశ్వరయ్య బీసీల న్యాయపోరాటాలకు ప్రేరణ ఇచ్చారు. ఈ త్రిమూర్తులు అగ్రకుల పార్టీలకు అభిముఖంగా అంబేద్కర్ మార్గంలో నడుస్తూ పీడిత వర్గాల విముక్తికి తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల సాధన సమితిలో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. బీసీ ఉద్యమానికి కథానాయకులై నడిపిస్తున్నారు. వీరికి తోడుగా వివిధ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మేధావులు, కుల సంఘాలు కలిసి వస్తున్నారు. గతంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో 10వేల కిలో మీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీల కులాల వాటానడుగుతూ రాజ్యాధికార స్పృహ రగిలించారు. ఇదే నేటి బీసీల సంఘటిత మహోద్యమానికి కారణమైనది.




