
సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో వరుస పరాజయాలతో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా చివరి వన్డేలో గెలుపొంది పరువు నిలుపుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను విజయంతో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన భారత్ ఆఖరి మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 9 వికెట్ల తేడాతో ఓదార్పు విజయాన్నందుకుంది. దాంతో సిరీస్ 2-1తో ఆసీస్ కైవసమైంది. టీమిండియా సీనియర్ బ్యాటర్లలో రోహిత్ శర్మ 121 నాటౌట్(125 బంతుల్లో 13×4, 3×6) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ 74 నాటౌట్(81 బంతుల్లో 7×4) అజేయ అర్థశతకంతో రాణించాడు. తమలో ఇంకా వన్డే క్రికెట్ ఆడే సత్తా ఉందని చాటి చెప్పారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యా టింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ రేన్‌షా(58 బంతుల్లో 2 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(41), మా థ్యూ షార్ట్(30) విలువైన ఇన్నింగ్స్ ఆడారు.
భారత బౌలర్లలో హర్షిత్ రాణా(4/39) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. వాషింగ్టన్ సుందర్(2/44) రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 232 పరుగులు 69 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(24) మరోసారి విఫలమవ్వగా.. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు. సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.
రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం..
స్వల్ప లక్ష్యచేధనలో టీమిండియాకు శుభారంభం దక్కింది. శుభ్‌మన్ గిల్(24) త్వరగానే ఔటైనా… తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం లభించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ చెలరేగాడు. 63 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. విరాట్ కోహ్లీ తనదైన శైలిలో చెలరేగాడు. 56 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రోహిత్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 105 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 105 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పారు.




