
మనతెలంగాణ/హైదరాబాద్: లిక్కర్ గురించి మాట్లాడే హక్కు కెటిఆర్‌కు లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ కుటుంబం అంటేనే లిక్కర్ మాఫియా అని ఆయన అన్నారు. దేశంలో తెలంగాణకు విలువ లేకుండా చేసిన పాపం కెసిఆర్ కుటుంబానిదేనని ఆయన చెప్పారు. టెండర్లు కాకుండానే లిక్కర్ కుంభకోణం జరిగిందని కెటిఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఆధారాలు ఉంటే చూపించాలని, కానీ, అడ్డగోలుగా ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. టానిక్ పేరుతో కెటిఆర్, సంతోష్ రావులు కలిసి మద్యం వ్యాపారం చేయలేదా? అని ఆయన ప్రశ్నించారు. కెటిఆర్ మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన విమర్శించారు. టానిక్ పేరుతో మీరు ఎంత దోచుకున్నారో నిరూపిస్తామని ఆయన సవాల్ చేశారు.
దీనిపై జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు. మీ రాజకీయాల్లోకి సిఎం అల్లుడిని లాగడం సిగ్గుచేటని, మరోసారి ఇష్టమున్నట్టు మాట్లాడితే తగిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మద్యం టెండర్లలో ఎలాంటి అవినీతి జరగలేదని, రిజ్వీ మంచి అధికారి అని, ఆయన తన ఇష్టంతోనే విఆర్‌ఎస్ తీసున్నారని ఆయన తెలిపారు.




