
మనతెలంగాణ/హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రిజ్వీ 1999 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయనకు సుమారుగా 10 ఏళ్ల సర్వీసు ఉన్నా ఆయన పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆయన పనితీరుపై ప్రభుత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఆయన పనితీరుతో పాటు మద్యం కంపెనీల విషయమై సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీల మధ్య వార్ జరిగిందన్న చర్చ ప్రస్తుతం ఎక్సైజ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీపై పలు ఆరోపణలు చేస్తూ మంత్రి జూపల్లి సిఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. దీంతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ తీసుకున్న నిర్ణయాలతో ఎక్సైజ్ శాఖకు కోట్లలో నష్టం వచ్చిందని సిఎంకు మంత్రి జూపల్లి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం.
మంత్రి జూపల్లి చేసిన ఫిర్యాదులోని కొన్ని అంశాలు ఇలా…
మంత్రి జూపల్లి చేసిన ఫిర్యాదులోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. మద్యం లేబుళ్లకు సంబంధించి రిజ్వీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, దీంతోపాటు 2బి బార్‌ల విషయంలోనూ నిబంధనలకు విరుద్ధంగా రిజ్వీ వ్యవహారించారని, బార్ యజమానుల బకాయిల చెల్లింపులోనూ, బార్ లైసెన్సులను రెన్యువల్ వ్యవహారంలోనూ రిజ్వీ ఆరునెలల పాటు ఆలస్యం చేశారని మంత్రి జూపల్లి సిఎంకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. వీటితో పాటు టిజిబిసిఎల్ విషయంలోనూ రిజ్వీపై మంత్రి జూపల్లి అనేక ఫిర్యాదులు చేసినట్టుగా తెలిసింది. రిజ్వీపై వచ్చిన ఆరోపణలపై మంత్రి జూపల్లి సంజాయిషీ కోరినా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ పట్టించుకోలేదని మంత్రి జూపల్లి సిఎంకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది.
టిజిబిసిఎల్‌లో అనేక అవకతవకలు?
టిజిబిసిఎల్‌లో అనేక అవకతవకలు జరిగాయని, వాటికి సంబంధించి రికార్డులను సమర్పించాలని మంత్రి జూపల్లి ఆదేశించినా అటు ప్రభుత్వానికి, ఇటు మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ సమర్పించలేదని మంత్రి జూపల్లి సిఎంకు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. ఇక, మద్యం ధరల విషయంలోనూ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చేటట్టు వ్యవహారించారని ఇదే విషయమై గతంలోనూ ప్రభుత్వం ఆయన్ను వివరణ కోరగా ఆ విషయంలోనూ ఆయన స్పందించలేదని తెలిసింది. ప్రస్తుతం సిఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు వెళ్లిన నేపథ్యంలో రిజ్వీ మనస్థాపంతో విఆర్‌ఎస్ తీసుకున్నట్టుగా సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
14 నెలల పాటు వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా
వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన సుమారు 14 నెలల పాటు పనిచేశారు. గతనెల 18వ తేదీన రిజ్వీకి జిఏడి ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను సైతం ప్రభుత్వం అప్పగించింది.ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీకి సంబంధించిన వారు మాత్రం ఆయనకు ఓ ప్రైవేటు కంపెనీలో ముఖ్య అధికారిగా ఆఫర్ వచ్చిందని నెలకు రూ.25 నుంచి రూ50 లక్షల జీతమని పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం ఆయన అనారోగ్య కారణంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారని పేర్కొంటుండడం విశేషం.
ముగ్గురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు
రిజ్వీ విఆర్‌ఎస్‌కు ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బాధ్యతల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. అందులో భాగంగా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రఘునందన్ రావుకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఇక, దేవాదాయశాఖ డైరెక్టర్‌గా ఎస్.హరీశ్‌కు అదనపు బాధ్యతలను అప్పగించగా, గనుల శాఖ డైరెక్టర్‌గా భవేశ్ మిశ్రాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌గా గరిమ అగర్వాల్‌ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జిఓ ఆర్‌టి 1472లో ఉత్తర్వులు జారీ చేశారు.




