
ఓఆర్‌ఆర్ బౌండరీ, మూసీనది వెడల్పును..
ఆదిత్య భూమి సరిహద్దును.. నిర్ధారించండి
బఫర్ జోన్‌లో నిర్మాణాలు వస్తున్నాయి
నాలా ఏర్పాటు చేయకుండానే కట్టడాలు
లేఖలో వివరించిన కమిషనర్ రంగనాథ్
మనతెలంగాణ, సిటీబ్యూరో: మూసీ సదిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంపై హైడ్రా సీరియస్‌గా పరిగణిస్తుంది. ప్రకృతిపరంగా ప్రవహిస్తున్న నదిలో ఆక్రమణలు చేపట్టడంపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఉపేక్షించేది లేదంటూనే మూసీని ఆక్రమించినట్టుగా వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈమేరకు గండిపేట్ మండల తహాశీల్దార్‌కు ఈ నెల 22నసరిహద్దులను ఫిక్స్ చేయాల్సిందిగా లేఖ రాశారు. ఆ లేఖలో మంచిరేవుల గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 476 సరహద్దులతో పాటు ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దును నిర్దారించాలని సూచించారు.
ఈ క్రమంలోనే శ్రీఆదిత్య నిర్మాణంపై స్థానిక ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల నుండి కూడా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఆ సంస్థ చేపడుతున్న నిర్మాణ స్థలాన్ని, అక్కడ నది వెడల్పును, ఔటర్ రింగ్ రోడ్ బౌండరీని కూడా నిర్థారించాలని కమిషనర్ రంగనాథ్ ఆలేఖలో సూచించారు. హైడ్రా పరిశీలనలో మంచిరేవుల గ్రామం సర్వే నెం. 476లో నాలా ఆక్రమణలు జరిగినట్టు, నదిని పూడ్చినట్టు, ఓఆర్‌ఆర్ ప్రాజెక్టులో పోయిన భూమిని నది తీరాన్ని కబ్జా చేయడం ద్వారా లబ్దిపొందినట్టు గుర్తించినట్టు హైడ్రా భావించినట్టు లేఖలో పేర్కొన్నది.
నాలా నిర్మించకుండానే.. నిర్మాణాలు..
డేమ్(డీఈఎం) వివరాల ప్రకారం.. శ్రీఆదిత్య కేడియా రియల్టర్ సంస్థ చేపట్టిన భవన నిర్మాణం మూసీ నది పాయలు కలిపే 0.37 ఎకరాల వాగును ఆక్రమించినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రదేశంలో నదిని వెడల్పును 23 మీటర్లు. నది బఫర్ జోన్ కూడా భవన నిర్మాణం ద్వారా 0.48 ఎకరాల విస్తీర్ణంలో ఆక్రమించినట్టుగా వెల్లడవుతోంది. నాలా (వాగు) సగటు వెడల్పు 16 మీ.లు ముస్కిన్ చెరువు/నాగిరెడ్డి కుంట నుండి ఈ నాలా వస్తూ కోకాపేట, నార్సింగి పరివాహక ప్రాంతం మీదుగా మూసీకి వస్తోంది. బిల్డర్లు ప్రస్తుతమున్న నాలాను మళ్లించాలనుకుంటే.. వారు నీటిపారుదల శాఖ మార్గదర్శకాల ప్రకారం బిల్డర్ తన సొంత ఖర్చులతో భూమిని తీసుకుని కొత్త నాలాను ఏర్పాటు చేయాలి.
నీటిపారుదల అధికారులు 08-10-2021న బిల్డర్‌కు జారీ చేసిన ఎన్‌ఓసి ప్రకారం ఓఆర్‌ఆర్ ఈ నాలాను ఏర్పాటు చేసిన అనంతరమే నిర్మాణాలు చేపట్టాలని స్పష్టంచేయడం జరిగింది. కానీ, శ్రీఆదిత్య కేడియా రియల్టర్లు అన్ని షరతులను ఉల్లంఘించి, కొత్త వరద నీటి కాలువను పూర్తి చేయకుండానే ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. 16 మీటర్ల వెడల్పున్న నాలాను మూసివేయడం వల్ల ఇటీవలి వర్షాలలో కోకాపేట, నార్సింగి ప్రాంతాలలో వరదలు సంభవించాయి. అని లేఖలో కమిషనర్ రంగనాథ్ లేవనెత్తారు.
ఆక్రమణలు..
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డీఈఎం డేటా ప్రకారం, మూసీ నదిని శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్ 2.34 ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించింది. హెచ్‌ఎంసి మంజూరు చేసిన బిల్డింగ్ పర్మిషన్‌లో బఫర్ జోన్‌గా చూపించారు. కానీ, డీఈఎం డేటా ప్రకారం అక్కడ 3.03 ఎకరాల భూమి ఆక్రమణలకు గురైందనీ, బఫర్ జోన్‌లో భవన నిర్మాణాలు వస్తున్నాయని కమిషనర్ పేర్కోన్నారు. సర్వే ఆఫ్ ఇండియా టోపో-షీట్ ప్రకారం, మూసీ నది ప్రాంతం 1.77 ఎకరాల వరకు. మూసీనది బఫర్ జోన్ 2.58 ఎకరాల వరకు ఆక్రమణకు గురైందని రంగనాథ్ తెలిపారు.
సర్వే నెం. 476లోనూ భూముల వివరాలలో తేడాలున్నాయి. ఆసర్వే నెంబర్‌లోని భూములు, వాటి సరిహద్దులను నిర్ధారించాలని గండిపేట్ తహాశీల్దార్‌కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు.




