
నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ పోలీసుల ఎన్‌కౌంటర్ లో మృతి చెందాడు. నిన్న నగర పోలీసులు రియాజ్ ను అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్త జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కుని పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రియాజ్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం.ఈ ఘటనలో రియాజ్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌పై డిజిపి శివధర్ రెడ్డి స్పందించారు.
“రియాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో.. రూమ్ బయట ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఆ గన్‌తో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించాడు. రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే ప్రజల ప్రాణాలు పోయేవి. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఎన్‌కౌంటర్ జరిపాం” అని డిజిపి తెలిపారు.
కాగా, నిజామాబాద్ జిల్లాలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కి సిసిఎస్ పోలీసులు తరలిస్తుండగా.. కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ ఛాతీలో పొడిచి రియాజ్ పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ పరిస్థితి విషమించడంతో మరణించాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీస్ శాఖ బృందాలు రంగంలోకి దిగి ఆదివారం పట్టుకున్నారు.




