
శ్రీలంక ఛాంపియన్‌షిప్‌నకు వెళ్లేందుకు ఆర్థిక సాయం
అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న తెలంగాణ బిడ్డ మిట్టపల్లి అర్చన
మనతెలంగాణ/హైదరాబాద్ : స్థానిక ప్రతిభను ప్రోత్సహించడంలో తమ నిబద్ధతను ప్రదర్శిస్తూ, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పారా-అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, చంద్రంపేట గ్రామానికి చెందిన అర్చన శుక్రవారం నంది నగర్‌లోని నివాసంలో కెటిఆర్‌ను కలిశారు. కుట్టుపని ద్వారా తన జీవనోపాధిని గడుపుతున్న అర్చన, డిసెంబర్ 8 నుండి 10 వరకు శ్రీలంకలో జరగనున్న అంతర్జాతీయ సౌత్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు పారా త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాచే ఎంపికయ్యారు.
అయితే, ప్రయాణ ఖర్చులు, ఇతర భాగస్వామ్య వ్యయాలను భరించలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న అర్చనకు ఈ విజయం అపశ్రుతిగా మారే ప్రమాదం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కెటిఆర్ తక్షణమే స్పందించి, అర్చనను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు. ఆమె ప్రయాణ, క్రీడా ఖర్చులన్నింటికీ పూర్తి ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా, ఛాంపియన్‌షిప్‌కు సిద్ధమయ్యేందుకు అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణా సామగ్రిని కూడా ఆమెకు అందజేశారు. కెటిఆర్ నుంచి సకాలంలో లభించిన ప్రోత్సాహంతో, అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనే అర్చన కల సాకారం కానున్నది.
అర్చన పోరాటం స్ఫూర్తిదాయకం
అర్చన కథ ఆమె ధైర్యం, పట్టుదలకు నిదర్శనం అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. చంద్రంపేటలోని ఒక కుట్టు మిషన్ నుండి అంతర్జాతీయ వేదికపైకి చేరుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. తెలంగాణ ఆమెను చూసి గర్విస్తోందని, రాష్ట్రానికే కాకుండా దేశానికి గర్వకారణంగా నిలిచేందుకు ఆమెకు అవసరమైన పూర్తి సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.




