
టీచర్లకు ఇవ్వాల్సిన పిఆర్‌సితో పాటు పెండింగ్ డి.ఎలను వెంటనే చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. టీచర్ల గురించి గొప్పగా మాట్లాడే సిఎం కనీసం వారికి సమయానికి జీతాలు కూడా చెల్లిచంటం లేదని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్(టిజెటిఎఫ్)ను కొత్తగా ఏర్పాటు చేశారు. ఫెడరేషన్ లోగోను శనివారం జాగృతి కార్యాలయంలో కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన 12 ఏళ్ల క్రితం నాటిదేనని చెప్పారు. అయితే ఇన్నాళ్లకు సమయం వచ్చిందన్నారు.
జయశంకర్ సార్ నా ఫేవరేట్ టీచర్
తన ఫేవరేట్ టీచర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కవిత చెప్పారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిలో ఆయన మనందరికీ టీచర్ మాదిరిగా అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పారనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీచర్లు కీలకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా కవిత గుర్తుచేశారు. ఆనాటి ప్రభుత్వం నిర్భంధం ఉన్న సరే తెలంగాణ మ్యాప్, ప్రత్యేక క్విజ్ పోటీలు నిర్వహించి భావజాల వ్యాప్తికి కృషి చేశారని పేర్కొన్నారు. అలాంటి టీచర్ల సమస్యలపై పోరాటం చేయటం మనందరి బాధ్యత అని కవిత అన్నారు. టిజెటిఎఫ్ టీచర్ల సమస్యలపై పోరాడుతుందన్నారు.
నా కొడుకు వయసు చిన్నది…ఇప్పుడే రాజకీయాలు లేవు
బిసి బంద్ కార్యక్రమంలో తన కుమారుడు పాల్గొనటంపై కవిత స్పందించారు. కేవలం సామాజిక బాధ్యత నేర్పే క్రమంలోనే తన కుమారుడిని బిసి బంద్ కార్యక్రమానికి తీసుకొచ్చానని చెప్పారు. బిసిల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నామంటే తాను పోరాటంలో పాల్గొంటానని అన్నారని తెలిపారు. మన ఇంటి నుంచే సామాజిక బాధ్యత నేర్పాలనే ఉద్దేశంతోనే బంద్ కార్యక్రమానికి తీసుకొచ్చానని చెప్పారు. తన కొడుకు వయసు చిన్నది అని, ఇప్పుడే రాజకీయాలు ఏమీ లేవని చెప్పారు. ముఖ్యమంత్రి కోటరీపై కొండా సురేఖ వ్యాఖ్యలపై తానేమీ స్పందించనని కవిత అన్నారు. నా కోటరీతోనే డీల్ చేయటమే నాకు కష్టమవుతుందని… సంబంధం లేని అంశంపై ఏమీ మాట్లాడలేనని అన్నారు. కార్యక్రమంలో టిజెటిఎఫ్ అధ్యక్షులు మోరం వీరభద్రరావు, అడ్‌హక్ కమిటీ సభ్యులు ఘనపురం దేవేందర్, జాడి శ్రీనివాస్, తానిపర్తి తిరుపతి రావు, ఎం. కవిత, సుజాత, ఉపాధ్యాయులు ఈరవేణి రాజ్ కుమార్, విష్ణువర్ధన్, దుర్గములత, ఎస్ ఆర్ సతీష్ కుమార్, కే గంగరాజు, కోటగిరి గంగా ప్రసాద్, కంచరి రవికుమార్, చిట్యాల సుజాత, నాగమల్ల ఉమాదేవి, జీ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.




