
దేశ రాజధాని ఢిల్లీలో సౌత్ ఏషియన్ యూనివర్శిటీ(ఎస్‌ఎయూ)లో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడి, దాష్టికం జరిగింది. సెక్యూరిటీ గార్డు సహా నలుగురు ఆమెపై లైంగిక దాడిచేసి, బట్టలు చించి, బలవంతంగా అబార్షన్ పిల్ తీసుకునేలా చేశారు. ఈ ఘాతుకం విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే అక్టోబర్ 12న జరిగింది. దీనిపై మంగళవారం ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా 18 ఏళ్ల ఆ బాధితురాలు బట్టలు చిరిగి, గాయాలతో అక్టోబర్ 13న క్యాంపస్‌లో కనిపించింది. కాగా ఈ ఘటనతో విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో ఎనిమిది గంటల నిరసన చేపట్టారు. విషయాన్ని పోలీసులకు తెలుపడంలో కావాలని ఆలస్యం చేస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఇదిలావుండగా ఈ ఘటనను సౌత్ ఏషియన్ యూనివర్శిటీ ఖండించింది. 10 రోజుల్లో వివరంగా రిపోర్టు ఇవ్వాలని ఆదేశిస్తూ దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేసింది. జిల్లా మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆర్యన్ యశ్ అనే వ్యక్తి ఆమెను బెదిరిస్తూ మార్ఫ్‌డ్ ఫోటోలు, నగ్నఫోటోలతో ఈమెయిల్ సందేశాలు, సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపాడని సమాచారం. అతడి సూచనలు పాటించి ఆ విద్యార్థిని స్నాతోకోత్సవ కేంద్రం సమీపంలో మూసేసిన నిర్మాణ ప్రాంతానికి వెళ్లింది. అక్కడికి ఓ గార్డు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆ గార్డు ఓ మధ్య వయస్కుడైన వ్యక్తిని, ఇద్దరు అబ్బాయిలను పిలిచాడు. వారు నలుగురు తనపై శారీరకంగా దాడిచేశారని, బట్టలు చింపేశారని, తన నాలుక కింద బలవంతంగా గర్భస్రావ మాత్రను పెట్టడానికి ప్రయత్నించారని, దానిని తాను ప్రతిఘటించి ఉమ్మేసానని బాధితురాలు తెలిపింది.
విశ్వవిద్యాలయం సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునే లోపే దాడి చేసిన వ్యక్తులు పారిపోయారు. పారిపోయిన నిందితులను పట్టుకోడానికి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆధారాలు సేకరిస్తున్నారు. సిసిటివి ఫుటేజ్‌లను సేకరించారు.పోలీసు డిప్యూటీ కమిషనర్(సౌత్) అంకిత్ చౌహాన్ దర్యాప్తును చేపట్టాక కేసు ప్రాధాన్యత పెరిగింది. బాధితురాలకి ప్రస్తుతం కౌన్సెలింగ్ జరుగుతోంది. ఆమె తల్లిదండ్రులు విడిపోవడంతో ఆమె డిప్రెషన్‌లో ఉంది. ఆమె తండ్రి బీహార్‌లో నివసిస్తుంటే, తల్లి ముంబైలో నివసిస్తోంది. ఇదిలావుండగా సౌత్ ఏషియన్ యూనివర్శిటీ ఈ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండించింది. విద్యార్థులకు అన్ని రకాల మద్దతునిస్తానని హామీ ఇచ్చింది.




