
ఢిల్లీ ప్రత్యేక కోర్డు ద్వారా కీలకమైన ఛార్జిషీట్
మోసం, కుట్ర, అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు
రైల్వే మంత్రిగా అధికార దుర్వినియోగంపై సాక్షాలు?
ఈ నెల చివరిలోనే విచారణ ప్రక్రియ ఆరంభం
మహాఘట్‌బంధన్ ప్రధాన పార్టీ ఆర్జేడికి సంకటం
న్యూఢిల్లీ : ఆర్జేడీ వ్యవస్థాపక నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం అభియోగాలు మోపింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రులు అయిన లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు, బీహార్‌లో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌లపై సంచలనాత్మక ఐఆర్‌సిటిసి స్కామ్ కేసులో రౌజ్ హౌస్ కోర్టు ఈ చార్జీషీట్‌కు దిగింది. లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు మోసం, కుట్రపూరిత చర్య, అవినీతికి పాల్పడటం ద్వారా భూములు కాజేశారనేది అభియోగం. ఈ క్రమంలో లాలూ కుటుంబానికి ప్రయోజనం చేకూరిందనేది వాదన. బీహార్‌లో రెండు దశల అసెంబ్లీ ఎన్నికలు మరో నెలరోజుల్లోనే జరగాల్సి ఉన్నదశలోనే ప్రధాన పార్టీ ఆర్జేడీకి కోర్టు చార్జీషీట్ షాక్ తగిలింది.
లాలూ, తరువాత రబ్రీదేవి ముఖ్యమంత్రులుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి, ఐఆర్‌సిటిసి మోసానికి పాల్పడ్డారనేది ప్రధానమైన ఆరోపణ. అభియోగాల నమోదు విషయాన్ని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే విచారణ క్రమంలో వెల్లడించారు. భూముల బదలాయింపులకు సంబంధించి వీరి పాత్ర పూర్తి స్థాయిలో అనుమానాస్పదంగా ఉందని , ఈ మేరకు ప్రాధమిక సాక్షాధారాలు లభించినందున ఇప్పుడు తదుపరి ప్రక్రియలో భాగంగా అభియోగాలను నమోదు చేసినట్లు తెలిపారు. నవంబర్ 6, తరువాత 11 తేదీలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి.
బీహార్‌లో ఎన్‌డిఎను ఢీకొంటూ నిలిచిన మహాఘట్‌బంధన్‌లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ముఖ్యమైన రాజకీయ పార్టీగా ఉంది. ఈ క్రమంలో ఈ కూటమి తరఫున తేజస్వీ యాదవ్‌నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు ఆయనపై కూడా అభియోగాలు నమోదు కావడం కీలకమైంది. తేజస్వీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
కేసు విచారణ ఈ నెలాఖరులోనే
అభియోగాలు నమోదు కావడంతో లాలూ కుటుంబ సభ్యులపై సంబంధిత కేసులో విచారణ ఈ నెల చివరిలోనే ఆరంభమవుతుంది. ఎన్నికల ప్రచారం ఉధృతదశలో ప్రత్యర్థి పార్టీలు ఆర్జేడీపై విరుచకుపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. అభియోగాల నమోదు విషయం ఇప్పుడు ఎన్నికల బీహార్‌లో రాజకీయ వేడివేడి చర్చకు దారితీసింది. రెండు భారతీయ రైల్వే కేటరింగ్ సర్వీసులు రెండింటిని, ఐఆర్‌సిటిసి హోటల్స్‌ను ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారని, ఇందుకు బదులుగా ఈ ఫ్యామిలీ భారీ స్థాయిలో విలువైన భూములను తమ సొంతం చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. వీరిపై అవినీతి నిరోధక చట్టం పరిధిలోని నిబంధనలకు అనుగుణంగా అభియోగాలు దాఖలు చేశారు.
అభియోగాల్లోని కార్యనిర్వాహక భాగంలోని కొన్ని అంశాలను జడ్జి చదివి విన్పించారు. కాంట్రాక్టుకు బదులుగా ఈ కుటుంబానికి అతి చవక ధరలకు పొందిందని, సుజాత హోటల్స్‌కు బినామీగా లాలూ కుఉంబం ఉందని, భూమిని నామమాత్రపు ధరలకు పొందడం ద్వారా కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం కల్గించారని న్యాయమూర్తి తెలిపారు. ఈ వ్యవహారంపై గతంలో సిబిఐ దర్యాప్తు సాగింది. మూడు ఎకరాల భూమి , అత్యంత విలువైన ధర పలికేదానిని తమ పేరిట రాయించుకున్నారనే విషయంపై 2017లోనే లాలూపై ఎఫ్‌ఐఆర్ దాఖలు అయింది.
ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ కేసుకు సంబందించి తీవ్రస్థాయి అభియోగాలు న్యాయస్థానం ద్వారా దాఖలు అయ్యాయి. ఛార్జీషీట్‌లో వీరితో పాటు ఐఆర్‌సిటిసి జిఎంలు వికె అస్థానా, ఆర్‌కె గోయల్‌తో పాటు హోటల్ సుజాత డైరెక్టర్లు, ఛానక్య హోటల్ యజమానులు అయిన విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్‌లను కూడా చేర్చారు. లారా ప్రాజెక్టుగా చలామణి అయ్యే డిలైట్ మార్కెటింగ్ కంపెనీ , సుజాత ప్రైవేటు లిమిటెడ్‌లను ఛార్జీషీట్‌లో నిందితులుగా చేర్చారు. 2004 2009 మధ్యలో లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా వ్యవహరించారు.




