Sunday, November 23, 2025
Google search engine
HomeUncategorizedప్రపంచ వేదికపై సిరిసిల్ల సత్తా

ప్రపంచ వేదికపై సిరిసిల్ల సత్తా

తెలంగాణ ఇవి ఆవిష్కరణలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గ్రావ్టన్ మోటార్స్ ఫౌండర్

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశంస

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఆవిష్కరణలను అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లిన సిరిసిల్ల బిడ్డ, గ్రావ్టన్ మోటార్స్ వ్యవస్థాపకుడు పర్శురామ్ పాకను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా అభినందించారు. ఒక ఆవిష్కర్తకు ప్రేరణ ఇచ్చే ఎకో సిస్టం లభించినప్పుడు అద్భుతాలు జరుగుతాయని పేర్కొన్నారు. పర్శురామ్ పాక వంటి ప్రతిభావంతులను పోషించడంలో తెలంగాణలోని ఆవిష్కరణల కేంద్రాలైన టీ- హబ్, టీ- వర్క్ పాత్ర కీలకమని కొనియాడారు. సిరిసిల్లకు చెందిన పర్శురామ్ పాక మన ఇంక్యుబేటర్ల (టి హబ్, టి వర్క్) వద్ద ఉన్న అత్యాధునిక సౌకర్యాలను ఉపయోగించుకుని గ్రావ్టన్ మోటార్స్‌ను స్థాపించారని తెలిపారు. నేడు ఈ సంస్థ తెలంగాణ నుంచే ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తయారు చేస్తోందని కెటిఆర్ పేర్కొన్నారు. గ్రావ్టన్ మోటార్స్ తమ మోటార్లు, బ్యాటరీలు, కంట్రోల్ సిస్టమ్స్‌ను పూర్తిగా దేశీయంగా రూపొందించి, తయారు చేసిందని తెలిపారు. ఇది నిజమైన మేడ్- ఇన్ -ఇండియా, మేడ్ -ఫర్- ది -వరల్డ్ విజయగాథ అని కెటిఆర్ అభివర్ణించారు.

కే2కే ప్రపంచ రికార్డ్, అంతర్జాతీయ విస్తరణ

గతంలో గ్రావ్టన్ మోటార్స్ సంస్థ 4,000 కిలోమీటర్ల కశ్మీర్ -టు -కన్యాకుమారి(కె2కె) రైడ్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పిందని కెటిఆర్ తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీ కెన్యా, ఫిలిప్పీన్స్, పెరూ వంటి దేశాలకు తమ కార్యకలాపాలను విస్తరిస్తోందని అన్నారు. శుక్రవారం కోయంబత్తూరులో పర్శురామ్ పాకను కలిశానని, ఆయన కంపెనీ ప్రయాణం, విజయాలు తనను ఎంతగానో ప్రేరేపించాయని తెలిపారు. ఇది తనకు నిజంగా అవసరమైన ఎనర్జీ బూస్టర్ అని వ్యాఖ్యానించారు.

పర్శురామ్, గ్రావ్టన్ మోటార్స్ ఈవీ బృందానికి అభినందనలు తెలుపుతూ, ఆయన కథ మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిష్కరణల వ్యవస్థ స్థానిక మేధస్సును అంతర్జాతీయ ప్రభావిత శక్తిగా మారుస్తూ, భారతదేశ ఈవీ విప్లవాన్ని ఎలా ముందుకు నడిపిస్తోందో ఈ విజయాలు నిరూపిస్తున్నాయని కెటిఆర్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments