
విశాఖపట్నం: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం విశాఖపట్నం వేదికగా ఆతిథ్య భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోరుకు ఆలౌటైంది. తర్వాత క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మహిళా టీమ్ మరో ఓవర్ మిగిలివుండగానే ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాకు ఇది మూడో విజయం కావడం విశేషం.
ఇక టీమిండియా వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అలీసా హీలీ, లిఛ్‌పిల్డ్‌లు శుభారంభం అందించారు. లిచ్‌ఫిల్డ్ ఆరు ఫోర్లు, సిక్స్‌తో 40 పరుగులు చేసింది. అష్లే గార్డ్‌నర్ (45), ఎలిసె పేరి 47 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హీలీ 107 బంతుల్లోనే 21 ఫోర్లు, 3 సిక్సర్లతో 142 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా అలవోక విజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు ప్రతీక రావల్ (75), స్మృతి మంధాన (80) అండగా నిలిచారు.




