
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎంఐఎం సంచలన నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ ఆ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 100 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ’ఇండియా’ కూటమి నుంచి పొత్తు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, ఒంటరిగా తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ పరిణామం బీహార్ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఐదు రెట్లు ఎక్కువ స్థానాల్లో పోటీకి దిగుతున్నామని ఎంఐఎం బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ శనివారం వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్‌డిఎ, మహాఘట్బంధన్ (ఇండియా కూటమి) కూటములకు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ శక్తిగా ఎదగడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ‘మా ఉనికిని ఇటు ఎన్‌డిఎ, అటు మహాఘట్బంధన్ గుర్తించేలా చేస్తామన్నారు. మా బలాన్ని తక్కువ అంచనా వేయలేరు‘ అని ఆయన అన్నారు. పొత్తు కోసం ఆర్జెడి అధినేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్‌లకు తాను లేఖ రాసినా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అఖ్తరుల్ ఇమాన్ తెలిపారు. ‘వారి నుంచి స్పందన లేనప్పుడు, మా పార్టీ బలాన్ని విస్తరించుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇఎంఐఎం ఇప్పటికే కొన్ని భావసారూప్యత కలిగిన పార్టీలతో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరికొన్ని రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వస్తుందని ఎంఐఎం నేతలు వెల్లడించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు స్థానాల్లో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఆ తర్వాత నలుగురు ఎంఎల్ఎలు ఆర్జెడిలో చేరడంతో ప్రస్తుతం అఖ్తరుల్ ఇమాన్ మాత్రమే పార్టీ ఏకైక శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. బీహార్‌లో 17 శాతానికి పైగా ఉన్న ముస్లిం జనాభానే లక్ష్యంగా చేసుకుని ఎంఐఎం తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇటీవల పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా సీమాంచల్ ప్రాంతంలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎంఐఎం పోటీతో సెక్యులర్ ఓట్లు చీలి బిజెపికి లాభం చేకూరుతుందని విపక్షాలు ఆరోపిస్తుండగా, తమ పార్టీ ఏ కూటమికి ’బిటీమ్’ కాదని ఎంఐఎం నేతలు స్పష్టం చేస్తున్నారు.




