స్టాక్‌హోమ్ : హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్‌జ్నా హోర్కె ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ఆయన రాసిన ‘హెర్ష్ 07769’ అనే నవల జర్మనీ లోని సామాజిక అశాంతిని చిత్రీకరించింది. ఈ నవలకే నోబెల్ బహుమతి వరించింది.ఈ నవలలో చనిపోయిన ఇద్దరు అద్బుతమైన వ్యక్తులు తిరిగి వస్తారన్న నమ్మకంతో మోక్షం కోసం ఎదురు చూస్తున్న నిరుపేద ప్రజల మూఢత్వాన్ని చిత్రీకరించారు. ఇందులో హింస, అందం కలగలసి పోయిందని, ప్రపంచ వినాశనం వంటి తీవ్ర భయానక పరిస్థితుల మధ్య కూడా కళకు ఉన్న అపారమైన శక్తిని తన రచనల ద్వారా బలంగా చాటి చెప్పినందుకు లాస్లోకు ఈ గౌరవం అందిస్తున్నట్టు నోబెల్ కమిటీ అభివర్ణించింది. ఆయన సాహిత్యం సమకాలీన ప్రపంచం లోని సంక్లిష్టతలను, మానవ అస్తిత్వ వేదనను, వినూత్నశైలిలో ఆవిష్కరించారని పేర్కొంది. 07769 నవల తరువాత 1994 లో సినిమాగా డైరెక్టర్ బెలాటార్ రూపొందించారు.
ఈ రచనను గొప్ప సమకాలీన జర్మన్ నవలగా పాఠకులు అభివర్ణించారు. అపోకలిప్టిక్ (అలౌకిక) భయాల మధ్య కూడా కళాశక్తిని చాటుతూ ఆయన చేసిన రచనలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. లాస్లో గాఢమైన ఆలోచనలు, మానవ మనస్తత్వాన్ని లోతుగా వ్యక్తపరిచే శైలికి ప్రపంచ వ్యాప్తంగా విమర్శకులు ప్రశంసలు అందుకున్నాయి. గంభీరమైన వాక్య నిర్మాణాలు, నిరాశ, భవిష్యత్తు, గురించి భయపెట్టే ఇతివృత్తాలతో కూడిన పోస్ట్‌మోడర్న్ ( ఆధునికానంతర )నవలలు రచించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ముఖ్య రచనలలో ‘సాతాన్ ట్యాంగో’ , ‘ది మెలాంకోలీ ఆఫ్ రెసిస్టెన్స్’ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. ఈ రచనలు మానవుడి ఒంటరితనం, ఆధునిక నాగరికత లోని నిస్సారతపై సాహిత్యపరంగా మంచి పేరు పొందాయి. లాస్లో రచనలు మొదట హంగేరియన్ భాషలో రాయబడినప్పటికీ, అవి అనేక యూరోపియన్ భాషల్లోకి అనువదింపబడ్డాయి. అనేక అంతర్జాతీయ పురస్కారాలు కూడా ఈయనకు లభించాయి.
వాటిలో బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ 2015లో లభించింది. సినీ దర్శకుడు బెలా టార్ తీసిన చిత్రాలు కూడా లాస్లో నవలల ఆధారంగా రూపొందడంతో ఆయన రచనలకు అంతర్జాతీయ ఖ్యాతి మరింత పెరిగింది. 1954 లో ఆగ్నేయ హంగేరీలో రొమేనియన్ సరిహద్దుకు సమీపంలో గ్యులా అనే చిన్న పట్టణంలో ఆయన జన్మించారు. ఆయన మొట్టమొదటి నవల ‘సాటం టాంగో’ 1985 లో ప్రచురించారు. ఈ రచన హంగేరీలో సాహిత్య సంచలనం సృష్టించింది. గత ఏడాది దక్షిణ కొరియా రచయిత్రి హాన్‌కాంగ్‌కు ఈ బహుమతి లభించింది. హాన్‌కాంగ్‌కి ఈ గౌరవం లభించడం ఆసియా సాహిత్యానికి కొత్త ఉత్సాహం కల్పించింది. ఈ సంవత్సరం లాస్లో ఎంపికతో యూరోపియన్ సాహిత్యం మళ్లీ నోబెల్ వేదికపై వెలుగొందింది. ఇక 1901 నుంచి 2024 వరకు 117 సార్లు సాహిత్యంలో నోబెల్ ప్రకటించగా, ఇప్పటివరకు 18 మంది మహిళలు ఈ పురస్కారం అందుకున్నారు.