కొబ్బరి బోండాల మాటున గంజాయి అక్రమ రవాణా గుట్టును రాచకొండ నార్కొటిక్స్ పోలీస్‌స్టేసన్, ఈగల్ టీం, ఖమ్మం వింగ్ సంయుక్తంగా రట్టు చేసింది. ముగ్గురు రాజస్థాన్ ట్రాన్స్‌పోర్టర్లు చోటు నారాయణ లాల్ నాయక్, పుష్కర్ రాజ్ నాయక్, కిషన్ లాల్ నాయక్‌లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 401 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. గంజాయి అక్రమ రవాణా అవుతోందనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్ టీం రంగంలోకి దిగింది. రామోజీ ఫిల్మ్ సిటీ, పెద్ద అంబర్‌పేట్ సమీపంలో విశాఖపట్నం నుండి రాజస్థాన్‌కు అక్రమంగా 401 కిలోల గంజాయిని రవాణా చేస్తున డిసిఎం వాహనాన్ని అడ్డగించింది. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ట్రాన్స్‌పోర్టర్లను ఈగల్ టీం అరెస్టు చేసింది. కేసులో మొత్తం ఆరుగురు నిందితులు చోటు నారాయణ లాల్ నాయక్, పుష్కర్ రాజ్ నాయక్, కిషన్ లాల్ నాయక్, శ్రీధర్, అషు, పరమేశ్వర్‌లు ఉండగా, వారిలో ముగ్గురు నిందితులు శ్రీధర్, అషు, రమేశ్వర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని ఈగల్ టీం తెలిపింది. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన ఓం బిష్ణోయ్ తన పట్టణంలో గంజాయి రవాణాలో పాలుపంచుకున్నాడు.అతను రాజమండ్రిలోని శ్రీధర్ నుండి అక్రమ వస్తువులను సేకరించి, తన హ్యుందాయ్ వెన్యూలో షిప్‌మెంట్‌లను రవాణా చేయడానికి చోటు నారాయణ లాల్ నాయక్‌ను నియమించుకున్నాడు. అతనికి ప్రతి ట్రిప్‌కు రూ.25,000 చెల్లించాడు. ఒడిశాలోని జగదల్‌పూర్‌లో ఓం బిష్ణోయ్‌ను అరెస్టు చేసి, తరువాత జైలులో ఉంచినప్పుడు,
చోటు నారాయణ లాల్ నాయక్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కిలోగ్రాముకు 2,000 చొప్పున 400 కిలోగ్రాముల గంజాయిని కొనుగోలు చేయడానికి శ్రీధర్‌తో ప్రత్యక్ష ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత నాయక్ గంజాయిని బికనీర్‌లోని ఆశుకు కిలోకు 4,000 చొప్పున విక్రయించాలని పథక రచన చేశాడు. ఈ ఆపరేషన్‌లో రవాణా ఏర్పాట్ల కోసం పుష్కర్ రాజ్ నాయక్, కిషన్ లాల్ నాయక్, పరమేశ్వర్‌లను కూడా నాయక్ చేర్చుకున్నాడు. తరువాత, అక్రమంగా రవాణా చేసిన వస్తువులను ఒక వ్యాన్‌లో ఎక్కించి, కొబ్బరికాయల లోడు కింద దాచి, రాజస్థాన్‌కు వెళ్లాలని పథక రచన చేశారు. కిషన్ లాల్ నాయక్ నడుపుతున్న వ్యాన్‌కు నాయక్, పుష్కర్ తమ కారులో ఎస్కార్టుగా వెళ్లారు. అబ్దుల్లాపూర్‌మెట్ ఎక్స్ రోడ్ సమీపంలోని విజయవాడ హైవే వెంట ప్రయాణిస్తుండగా, రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, ఈగల్ టీం, ఖమ్మం వింగ్‌కు చెందిన సంయుక్త బృందం రెండు వాహనాలను అడ్డగించి చోటు నారాయణ లాల్ నాయక్,కిషన్ లాల్ నాయక్, పుష్కర్ రాజ్ నాయక్‌లను అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల వద్ద నుంచి 401.467 కిలోగ్రాముల గంజాయి, వ్యాన్, కారుతో సహా ఐదు సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డిపిఎస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.