యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్‌లో కంటైనర్ లారీ ఢీకొని హోంగార్డు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన కూరెళ్ల ఉపేంద్ర చారి (36) రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీలో భాగంగా తెల్లవారుజామున వెహికిల్ చెకింగ్ చేస్తుండగా, భువనగిరి నుండి చిట్యాల వైపు వెళుతున్న లారీ కంటైనర్ అతి వేగంగా హోంగార్డుపై దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలం వద్ద పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఆసుపత్రికి తరలించారు.
నివాళులర్పించిన మాజీ ఎంఎల్‌ఎ చిరుమర్తిః హోంగార్డు ఉపేంద్రచారి మరణవార్త తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎంఎల్‌ఎ చిరుమర్తి లింగయ్య రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బిఆర్‌ఎస్ మండల నాయకులు తదితరులు ఉన్నారు.
పోలీసుల చేయూతః హోంగార్డు ఉపేంద్రచారి విధి నిర్వహణలో భాగంగా రోడ్డు ప్రమాదంలో మరణిచడంతో అతని కుటుంబానికి అండగా, తక్షణమే సిపి సుధీర్‌బాబు హోంగార్డు సంక్షేమ నిధి నుంచి 10 వేల రూపాయలు, భువనగిరి హెడ్ క్వార్టర్స్ తరపున అడిషనల్ ఎస్‌పి, ఆర్‌ఐ, ఆర్‌ఎస్‌ఐలు, హెచ్ సిసి, ఉమెన్ పిసిఎస్ కలిసి సమకూర్చిన లక్ష రూపాయలను అడిషనల్ ఎస్‌పి వినోద్‌కుమార్, అడ్మిన్ ఆర్‌ఐ శ్రీనివాస్ హోంగార్డు కుటుంబ సభ్యులకు అందజేశారు.