న్యూఢిల్లీ : దగ్గు మందుతో చిన్నారుల మరణాల సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మధ్యప్రదేశ్‌లో కోల్డ్ రిఫ్ దగ్గుమందు కారణంగా పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఈ ఔషధం ఎగుమతులపై భారత్‌ను ఆరా తీసినట్టు తెలుస్తోంది. “ చిన్నారుల మరణాలకు కారణమైన కోల్డ్‌రిఫ్ దగ్గు మందును ఇతర దేశాలకు ఎగుమతి చేశారా అని డబ్లుహెచ్‌ఓ భారత్‌ను అడిగింది. సంబంధిత అధికారుల నుంచి వివరణ వచ్చిన తర్వాత ఈ ఔషధంపై గ్లోబల్ మెడికల్ ప్రొడక్ట్ అలర్ట్ జారీ చేయాలా? వద్దా? అనే దానిపై అంచనా వేయనుంది” అని ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ దగ్గుమందు కారణంగా చిన్నారుల మరణాలు పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో మృతుల సంఖ్య 20కి చేరింది. ఒక్క చింద్వాడాలోనే 174 మంది ప్రాణాలు కోల్పోయినట్టు మధ్యప్రదేశ్ ఆరోగ్య మంత్రి రాజేంద్ర శుక్లా బుధవారం వెల్లడించారు. మరో ఐదుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇలాంటి కల్తీ మందు తాగి రాజస్థాన్ లోనూ కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. కోల్డ్‌రిఫ్ దగ్గుమందును తమిళనాడు లోని కాంచీపురానికి చెందిన శ్రీసన్ ఫార్మా యూనిట్ తయారు చేసింది. మరణాల నేపథ్యంలో ఈ కంపెనీలో తనిఖీ చేయగా, సిరప్‌లో 48.6 శాతం డెఇథెలిన్ గ్లైకాల్ ఉందని తేలింది. ఇది అత్యంత విషపూరితమైనదిగా అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ కంపెనీపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు ఈ సిరప్‌పై ఇప్పటికే పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి.