నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికను గదికి తీసుకెళ్లిన యువకుడు మరో యువకుడితో కలిసి సామూహిక అత్యాచారం చేయడంతో బాలిక మృతి చెందింది. సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ మండలం అన్నా రెడ్డిగూడెం గ్రామానికి చెందిన (17) సంవత్సరాల మైనర్ బాలిక నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. బాలికను గత ఆరు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ గట్టు కింద అన్నారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గడ్డం కృష్ణ అనే యువకుడు వెంటపడ్డాడు. యువకుని మాయ మాటలు నమ్మి బాలిక అతనితో ప్రేమలో పడింది.
ఈ క్రమంలో మంగళవారం బాలికను ఒంటరిగా కలుద్దామని చెప్పిన యువకుడు నల్లగొండ టూ టౌన్ స్టేషన్ పరిధిలోని శంషునగర్ రోడ్ నెంబర్ 8లోని వాటర్ ట్యాంక్ సమీపంలోని తన ఫ్రెండ్ గదికి బాలికను తీసుకెళ్లాడు. అక్కడ మరో ఫ్రెండ్‌తో కలిసి బాలికపై సామూహిక అత్యాచారం చేయడంతో ఆమె మృతి చెందింది. ఘటనా స్థలాన్ని డిఎస్పి శివరాంరెడ్డి సందర్శించి వివరాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.