చండీగఢ్ రాష్ట్రంలో ఓ సీనియర్ ఐపిఎస్ అధికారి గన్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) వై పురాణ్ కుమార్ మంగళవారం(అక్టోబర్ 7) చండీగఢ్‌లోని తన నివాసంలో అనుమానాస్పదంగా మృతి చెందారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, కుమార్ తనను తాను సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన హర్యానా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. సంఘటన జరిగిన వెంటనే చండీగఢ్ పోలీసులు, హర్యానా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
చండీగఢ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) కన్వర్‌దీప్ కౌర్ మాట్లాడుతూ..”ఐపీఎస్ అధికారి మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఆయన మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు కుటుంబ సభ్యులను, ఘటన సమయంలో ఇంట్లో ఉన్నవారిని ప్రశ్నిస్తున్నారు” అని తెలిపారు.