గడ్డి మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని తాటికొండ గ్రామానికి చెందిన మారపాక అన్వేష్ (26), ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన గడ్డం పావని (22) ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఆరు నెలలుగా వీరిద్దరూ ఒకటిగానే ఉంటున్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లోని కళాశాలలో చదువుకునే సమయంలో వీరి మధ్య ప్రేమ మొదలైంది. దీంతో పెళ్లి చేసుకుందామనుకున్నారు.
సోమవారం అన్వేష్ ఇంటి వద్దనే ఇద్దరు గడ్డిమందు తాగారు. అన్వేష్ గ్రామంలోని ఒక షాపు వద్దకు వెళ్లి గడ్డి మందు డబ్బాను తీసుకొచ్చి ఇద్దరు గడ్డి మందు తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. మూడో రోజు కార్యక్రమానికి వెళ్లి తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు మందు తాగి నేలపై పడి ఉన్న ఇద్దరిని గమనించి వెంటనే స్థానికుల సాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిని పరిశీలించిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి తీసుకెళ్లామన్నారు. కాగా చికిత్స పొందుతున్న క్రమంలోనే అన్వేష్ మృతి చెందాడు. కాగా పావని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అన్వేష్ శవాన్ని పంచనామా చేసి స్టేషన్ ఘన్‌పూర్ సీఐ వేణు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.