అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ప్రసన్నం చేసుకునేందుకు పాకిస్తాన్ అరుదైన ఖనిజ సంపద దోచిపెట్టే కార్యక్రమం మొదలైంది. పాకిస్తాన్ లోని అరుదైన భూమి, కీలక ఖనిజాలతో కూడిన మొదటి నౌక అమెరికాకు బయలు దేరింది. అప్పులతో కుదేలై పోతున్న పాకిస్తాన్ లో ఖనిజ వనరులను అన్వేషించేందుకు, అభివృద్ధి చేయడానికి గత నెల ఓ అమెరికన్ కంపెనీతో సంతకం చేసిన ఒప్పందానికి అనుగుణంగా ఈ అరుదైన ఖనిజసంపద ఎగుమతి అవుతోంది. అమెరికాతో కుదిరిన ఈ ఒప్పందం, ఖనిజాల రవాణా పట్ల తీవ్ర నిరసనలు చెలరేగాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ – ఇ- ఇన్సాఫ్ అమెరికాతో షరీఫ్ ప్రభుత్వం కుదుర్చుకున్న రహస్య ఒప్పందాల పట్ల ఆందోళనలను లేవనెత్తింది. ప్రఖ్యాత దిన పత్రిక డాన్ లో సోమవారం వచ్చిన ఒ రిపోర్ట్ ప్రకారం అమెరికాకు రవాణా అయిన వాటిలో యాంటీ మోనీ, రాగి గాఢత, నియోడైమియం, ప్రసోడైమియం వంటి అరుదైన భూ మూలకాలు ఉన్నాయి.
పాకిస్తాన్ లో ఖనిజాల ప్రాసెసింగ్, అభివృద్ధి , సౌకర్యాల ఏర్పాటు చేయడానికి సుమారు 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు, అమెరికా స్ట్రాటజిక్ మెటల్స్ (యుఎస్‌ఎస్ ఎం0 సంస్థ, పాకిస్తాన్ మిలిటరీ ఇంజనీరింగ్ విభాగం, ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ మధ్య ఓ అవగాహన ఒప్పందం పై సెప్టెంబర్ లో సంతకాలు జరిగాయి.
పాకిస్తాన్ -అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఈ రవాణా ఓ ముఖ్యమైన మైలురాయిగా యుఎస్‌ఎస్ ఎం అభివర్ణించింది. గత నెల పాకిస్తాన్ ఆర్మీచీఫ్ అసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ వైట్ హౌస్ సందర్శించి డోనాల్డ్ ట్రంప్ తో సమావేశమైనప్పుడు అరుదైన భూ ఖనిజాలు, రాళ్లతో కూడిన పెట్టెను బహుకరించిన చిత్రం వైరల్ అయింది. ఆ తర్వాతే ఈ నమూనాల రవాణా జరిగింది. డాన్ కథనం ప్రకారం
పాకిస్తాన్ లో ఖనిజ సంపద 6 ట్రిలియన్ డాలర్ల విలువైనది ఉందని అంచనా. ప్రపంచంలో అత్యంత అరుదైన ఖనిజ సంపదగల దేశాలలో పాక్ ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే, బహుళ జాతి సంస్థలు ఆ ఖనిజ సంపదను కనుగొనడంలో విఫలమై, పాక్ నుంచి పరారయ్యాయి. అమెరికా, అమెరికన్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల పూర్తి వివరాలను బహిరంగంగా వెల్లడించాలని ఇమ్రాన్ ఖాన్ పార్టీ సిటిఐ ప్రభుత్వాన్ని డిమాండ్ కోరుతోంది.