శ్రీశైలం ఆలయ అభివృద్ధి కోసం 2 వేల హెక్టార్ల అటవీ భూమి
కేంద్రాన్ని కోరనున్న కూటమి ప్రభుత్వం
సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి
అభివృద్ధి పనులతో పాటు పర్యావరణ పరిరక్షణకు సమ ప్రాధాన్యత
ఢిల్లీకి ప్రత్యేక అధికారుల బృందం
ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఎపి సిఎం చంద్రబాబు వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైలాన్ని ఒక ప్రధాన ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, అవసరమైన సౌకర్యాల కల్పన కోసం 2,000 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. ఈ నెల 16న శ్రీశైలం పర్యటనకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఈ అంశంపై చర్చించాలని సిఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఆదివారం సిఎం చంద్రబాబు అధ్యక్షతన దేవాదాయ శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డెప్యూటి సిఎం పవన్ కల్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అటవీ, దేవాదాయ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి: అధికారులకు సిఎం ఆదేశాలు
జ్యోతిర్లింగం, శక్తి పీఠం రెండూ కలిగిన దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీశైలం ఆలయ సమగ్రాభివృద్ధి పై సిఎం చంద్రబాబు చర్చించారు.
శ్రీశైలానికి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఏటా లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించ డమే లక్ష్యంగా ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లా డుతూ, ‘తిరుమల తర్వాత శ్రీశైలం రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృత మైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో సరైన పార్కింగ్ వసతి కూడా లేదు. భూమి అందుబాటులో లేకపోతే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం అసాధ్యం‘ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2,000 హెక్టార్ల అటవీ భూమిని దేవాదాయ శాఖకు బదలాయించాలని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖను కోరాలని నిర్ణయించారు.
ఢిల్లీకి ప్రత్యేక అధికారుల బృందం
ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి వివరించేం దుకు ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఢిల్లీకి పంపాలని కూడా సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్నందున ఆలయ సమగ్రాభివృద్ధికి తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న శబరిమల వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధ్యయనం చేసి, శ్రీశైలంలో ఆ తరహా ఏర్పాట్లు చేయాలని ఆయన ప్రతిపాదించారు. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శ్రీశైలానికి జాతీయ రహదారులతో అనుసంధానం కల్పించాలని సిఎం చంద్రబాబు సూచించారు. దోర్నాల, సుండిపెంట, ఈగలపెంట తదితర ప్రాంతాల మీదుగా జాతీయ రహదారులను ఆలయానికి అనుసంధానించేలా ప్రణా ళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.
అభివృద్ధి పనులతో పాటు పర్యావరణ పరిరక్షణకు సమ ప్రాధాన్యత
అయితే, అభివృద్ధి పనులతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కిచెప్పారు. పచ్చదనం పెంపు, అటవీ ప్రాం తాల అభివృద్ధిపై ఇప్పటికే కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సమాన స్థాయి లో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శ్రీశైలం పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని దీనికి ఓ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని సీఎం అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయంగా శ్రీశైలం అభివృద్ధి
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నీ అటవీ, గిరులపైనే ఉన్నాయని వారసత్వంగా వచ్చిన ఈ ఆలయాలను అభివృద్ధి చేసుకోవాలని ముఖ్య మంత్రి పేర్కొన్నారు. తిరుమల తర్వాత అతిపెద్ద ఆలయంగా శ్రీశైలం అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా భక్తులకు విస్తృతమైన సౌకర్యాలను కల్పిం చాల్సి ఉందని అన్నారు.