Thursday, October 9, 2025
Google search engine
HomeUncategorizedజంట నగరాల ప్రజలపై కక్ష సాధింపు చర్య..కాంగ్రెస్ సర్కార్ పై కెటిఆర్ ఫైర్

జంట నగరాల ప్రజలపై కక్ష సాధింపు చర్య..కాంగ్రెస్ సర్కార్ పై కెటిఆర్ ఫైర్

ఆర్‌టిసిని గట్టెక్కించకుండా ప్రజల నడ్డి విరుస్తున్నారు

ఒకేసారి రూ.10 పెంచడం దుర్మార్గం

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధ్వజం

మనతెలంగాణ/హైదరాబాద్ : జంటనగరాల్లో సిటీ బస్సు కనీస ఛార్జీని ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.10 పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ దుర్మార్గమైన నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పన్నిన కుట్ర అని విమర్శించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్న తరుణంలో ఈ ఛార్జీల పెంపు పిడుగులాంటిదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి నిత్య ప్రయాణికుడిపై నెలకు కనీసం రూ.500 అదనపు భారం మోపితే, బడుగుజీవులు, దినసరి కూలీలు ఎలా బతకాలని కెటిఆర్ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు, టీ-24 టిక్కెట్ ఛార్జీలను పెంచింది చాలదన్నట్టు, ఇప్పుడు కనీస ఛార్జీపై కనికరం లేకుండా 50 శాతం ధరలను పెంచడం రేవంత్ రెడ్డి అసమర్థ, అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానివాసుల నడ్డివిరిచేలా ప్రతి నిత్యం దాదాపు కోటి రూపాయల భారాన్ని ప్రజలపై మోపాలని చూస్తున్న ముఖ్యమంత్రికి హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకుంటున్నట్టు స్పష్టమవుతోందని ఆరోపించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో జంటనగరాల్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించారనే కసితోనే రేవంత్ రెడ్డి ఈ ప్రతీకార చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. తుస్సుమన్న ఉచిత బస్సు పథకంతో ఆర్‌టిసి సంస్థను దివాళా తీయించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు సామాన్య ప్రయాణికుల నడ్డి విరచాలని చూడటం క్షమించరానిది అని పేర్కొన్నారు. ఈ అసమర్థ పాలన వలన రాష్ట్ర ప్రగతి రథచక్రాలే కాదు, చివరికి ఆర్‌టిసి ప్రగతి రథచక్రాలు సైతం ధ్వంసం అయిన పాపం రేవంత్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ సర్కారును కుప్పకూల్చే వరకూ వెంటాడుతూనే ఉంటుందని కెటిఆర్ హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments