నా కుమారుడు రాజ్యసభ సభ్యునిగా ఉంటే&నాకు టిక్కెట్ ఇవ్వరా ?’ అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది తప్ప మంత్రి పొన్నం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు ఎంతో మంది ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయన సోదరుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆయన భార్య ఎమ్మెల్యే పద్మావతి, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట స్వామి ఆయన కుమారుడు ఎంపీగా, మంత్రి సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నారని, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క,
ఆయన సోదరుడు మల్లు రవి ఎంపీగా ఉన్నారని ఆయన చెప్పారు. కాబట్టి తాను టిక్కెట్ అడగడంలో తప్పేమి లేదన్నారు. పార్టీ అభ్యర్థి ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. అయితే మంత్రి పొన్నం స్థానికులకే టిక్కెట్ అంటూ చెప్పడం భావ్యం కాదని ఆయన కోపంగా అన్నారు. తాను సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యునిగా ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటితో తనకు అనుబంధం ఉందని ఆంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. తన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నందున టిక్కెట్ ఇవ్వడం కుదరదన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఇదిలాఉండగా అంజన్ కుమార్ యాదవ్ కాబోయే పార్టీ అభ్యర్థి అని ఆయన అనుచరులు ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమయ్యారు.