ఆసియాకప్‌లో టీం ఇండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ఓపెనర్ అభిషేక్ శర్మ. టోర్నమెంట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. అయితే అభిషేక్ ఇంట్లో ఓ శుభకార్యం జరిగింది. అతడి సోదరి కోమల్ శర్మ వివాహం లుథియానాకు చెందిన వ్యాపారవేత్త లవీశ్‌తో అమృత్‌సర్‌లో జరిగింది. ఈ వేడుకకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా హాజరయ్యారు. అయితే అభిషేక్ మాత్రం ఈ వివాహానికి వెళ్లలేదు.
అందుకు కారణం లేకపోలేదు.. శుక్రవారం ఆస్ట్రేలియా ఎ, ఇండియా ఎ మధ్య రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ జట్టులో అభిషేక్ కూడా ఉన్నాడు. ఈ మ్యాచ్ కోసం అతడు బుధవారమే కాన్సూర్ చేరుకున్నాడు. దీంతో సోదరి వివాహానికి హాజరు కాలేకపోయాడు. ఇక అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య సిరీస్ ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, ఐదు టి-20లు జరుగనున్నాయి.