ముంబై: సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ప్రతీ రోజు ఎవరో ఒకరు దాని బారిన పడుతున్నారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. చాలా మంది సెలబ్రిటీలు కూడా సైబర్ నేరాల వల్ల బాధింపబడ్డారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన జీవితంలో సైబర్ నేరాల వల్ల ఎలాంటి కష్టాలు వచ్చాయో వెల్లడించారు. సైబర్ నేరాపై అక్షయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అన్‌లైన్ గేమ్‌ల మాటున తన కుమార్తె కూడా సైబర్ వేధింపులకు గురైందని అక్షయ్ తెలిపారు. ముంబైలో సైబర్ అవేర్‌నెస్ మంత్ కార్యక్రమంలో అక్షయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘‘నా 13 ఏళ్ల కుమార్తెకూడా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతుండేది. కొన్నిసార్లు పరిచయం లేని వ్యక్తులతో ఆడాల్సి ఉంటుంది. తొలుత బాగా ఆడుతున్నావంటూ సందేశం వచ్చింది. అనంతరం ఎక్కడ ఉంటారు.. అమ్మాయా? అబ్బాయా? అని అడిగారు. అమ్మాయి అని రిప్లై ఇవ్వగానే న్యూడ్ ఫోటోలు పెట్టాలని అడిగారు. నా కుమార్తె ఫోన్ స్విచాఫ్ చేసి నా భార్యకు విషయం చెప్పింది. సైబర్ నేరాలు ఇలా ప్రారంభమై బెదిరింపులు, వేధింపులు ఎదురవుతాయి. నా కుమార్తెకే కాదు దేశంలో చాలా మందికి జరుగుతోంది. చదువుల్లో కూడా సైబర్ నేరాలపై సబ్జెక్ట్ ఉంటే బాగుంటుంది. సైబర్ భద్రత గురించి నేర్చుకోవడం చాలా ముఖ్యం’’ అని అక్షయ్ కుమార్ తనకు ఎదురైన చేధు అనుభవం గురించి తెలిపారు.