ప్రభుత్వం ఉద్యోగం పోతుందనే భయంతో అప్పుడే పుట్టిన చిన్నారిని సజీవ సమాధి చేసిన ఘటన మధ్యప్రదేశ్ చింద్వారాలో చోటు చేసుకుంది. కన్నతల్లి కూడా ఇందుకు సహకరించింది. అడవిలో శిశువు ఏడుపును స్థానికులు విని రక్షించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. శిశువు తల్లిదండ్రులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి ఉపాధిని పరిమితం చేస్తూ.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పలు నిబంధనలు అమలులోకి తీసుకువచ్చింది. అయితే అప్పటికే ముగ్గురు పిల్లలకు తండ్రైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బబ్లూకు తన ఉద్యోగం పోతుందనే భయం పట్టుకుంది. మూడో కొడుకు ఉన్నట్లు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ, అతడి భార్య మళ్లీ గర్భం దాల్చింది. దీంతో శిశువు పుట్టగానే చంపేద్దామని, లేదంటే తన ఉద్యోగం పోతుందని భార్య రాజకుమారిని కూడా ఒప్పించాడు. సెప్టెంబర్ 23 తెల్లవారుజామున భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే బబ్లూ చిన్నారిని తీసుకెళ్లి అడవిలో బండరాళ్ల మధ్య సజీవ సమాధి చేశాడు.
మూడు రోజుల అనంతరం చిన్నారి ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటపడింది. శిశువుకు చింద్వారా జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.