దుబాయ్: ఆసియాకప్-2025లో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే మ్యాచ్ అనంతరం ట్రోఫీ ప్రధానోత్సవంలో జరిగిన పరిణామాలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎసిసి చీఫ్ మోసిన్ నఖ్వీ చేతులు మీదుగా ట్రోఫీ అందుకోవడానికి భారత్ నిరాకరించడంతో నఖ్వీ ట్రోపీ, మెడల్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై బిసిసిఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎసిసి సర్వసభ్య సమావేశంలోనూ దీని గురించి ఘాటుగా మాట్లాడింది. అయితే అక్కడ కూడా నఖ్వీ సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారట.
అయితే నఖ్వీ తీరుపై బిసిసిఐ, ఐసిసికి ఫిర్యాదు చేసే దిశగా అడుగులు వేసింది. దీంతో నఖ్వీ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. బిసిసిఐకి నఖ్వీ క్షమాపణలు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ట్రోఫీ విషయంలో మాత్రం స్పష్టత లేదు. ట్రోఫీని, మెడల్స్‌ని తీసుకెళ్లిన నఖ్వీ వాటిని భారత్‌కు ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదని తెలుస్తోంది. బిసిసిఐకి ఇవ్వకుండా భారత కెప్టెనే తన ఆఫీస్‌కి రావాలని డిమాండ్ చేస్తున్నారట.